న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28,అర్జున్ సమాచారం:
ఆసియా క్రీడల్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న టీమిండియా నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారుఉదయం 5:30 గంటలకు జరగాల్సిన పాకిస్థాన్-హాంకాంగ్ తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే కారణంతో రద్దయింది. ఆ మ్యాచ్‌లోనూ అధిక ర్యాంకింగ్ ఆధారంగా పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఆఫ్ఘనిస్థాన్ 10వ స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్థాన్ 6వ ర్యాంకులో, హాంకాంగ్ 24వ ర్యాంకులో కొనసాగుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారమే భారత్, పాక్ జట్లు ముందంజ వేశాయిసెమీఫైనల్లో శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే మూడో క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడుతుంది. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్, మలేషియా మధ్య జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్ విజేతతో పాకిస్థాన్ పోటీ పడుతుంది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్ మంగళవారం, సెమీఫైనల్స్ గురువారం జరగనున్నాయి.
నిరాశ పరచిన బ్యాడ్మింటన్
సియా క్రీడలు 2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రయాణం క్వార్టర్ ఫైనల్ దశలోనే ముగిసింది. ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో చైనా స్టార్ ప్లేయర్ చెన్ యు ఫీ చేతిలో 21-11, 18-21, 10-21 తేడాతో సింధు పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత ఆమె ఎక్స్ వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. మ్యాచ్ ముగింపునకు కేవలం మూడు పాయింట్ల దూరంలో ఉన్న సమయంలో కీలక ర్యాలీలు చేజారడం తనను ఎంతగానో బాధిస్తోందని పేర్కొంది. 18 గంటల వ్యవధిలోనే వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం తన శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీసిందని సింధు వెల్లడించింది. “నా ఆసియా క్రీడల ప్రయాణం ముగిసింది, ఈ ఓటమి నన్ను ఎంతగానో బాధిస్తోంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను ముగించడానికి కేవలం మూడు పాయింట్ల దూరంలో ఉన్నప్పుడు చైనా షట్లర్‌తో జరిగిన సుదీర్ఘ ర్యాలీలే మ్యాచ్ గతిని మార్చేశాయి. నాకు అవకాశం వచ్చినప్పటికీ దాన్ని చేజార్చుకోవడం బాధాకరం” అని సింధు రాసుకొచ్చింది.నిర్వాహకులు నిర్ణయించిన షెడ్యూల్ ఎంత దారుణంగా ఉందో సింధు వివరించింది. “18 గంటల వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకు మ్యాచ్ ఆడి, హోటల్‌కు చేరుకుని రికవరీ పనులు ముగించుకుని నిద్రపోయేసరికి తెల్లవారుజామున 3 గంటలు దాటింది. మళ్లీ ఉదయం 8:30 గంటలకే మేల్కొని క్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ పరిణామం నా ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ నా పోరాట పటిమను పూర్తి స్థాయిలో ప్రదర్శించాను. చివరి క్షణాల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు నా కోచింగ్ టీమ్‌తో కలిసి పనిచేస్తాను” అని తెలిపింది.మ్యాచ్ ప్రారంభంలో సింధు అద్భుతమైన ఫామ్‌తో కనిపించింది. అటాకింగ్ గేమ్‌తో చెన్ యు ఫీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి తొలి గేమ్‌ను 21-11తో ఏకపక్షంగా గెలుచుకుంది. అయితే రెండో గేమ్‌లో చైనా ప్లేయర్ సుదీర్ఘ ర్యాలీలతో సింధును బాగా అలసిపోయేలా చేసింది. 18-21తో రెండో గేమ్‌ను కోల్పోయిన సింధు, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అలసట కారణంగా 10-21తో ఓటమిని మూటగట్టుకుంది. “ఒక చేదు ఫలితం దేశం కోసం 12 ఏళ్లుగా నేను సాగించిన ప్రయాణాన్ని తక్కువ చేయలేదు. 2014 నుంచి ఇప్పటివరకు నాలుగు ఆసియా క్రీడల్లో ఇండియా తరఫున శాయశక్తులా పోరాడాను” అని సింధు పేర్కొంది.
బ్యాడ్మింటన్‌లో భారత పోరాటం ముగింపు.. షెడ్యూల్‌పై పెరిగిన అసంతృప్తి
మరో క్వార్టర్ ఫైనల్లో యువ షట్లర్ ఉన్నతి హుడా సైతం జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచి చేతిలో ఓడిపోవడంతో వ్యక్తిగత విభాగంలో భారత బ్యాడ్మింటన్ కథ ముగిసింది. పురుషుల టీమ్ ఈవెంట్లో దక్కిన కాంస్య పతకం మాత్రమే భారత్‌కు మిగిలింది. కాగా బ్యాడ్మింటన్ షెడ్యూల్ తీరుపై ఇప్పటికే ఇండోనేషియా స్టార్ జోనాథన్ క్రిస్టీ, జపాన్ షట్లర్ కొడై నరవోక, చైనా డబుల్స్ ప్లేయర్ టాన్ నింగ్ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
============================